'గృహజ్యోతి పథకం కోసం వివరాలివ్వండి'.. ప్రజలకు అధికారుల సూచన

'గృహజ్యోతి' స్కీం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఫ్రీగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకు ఉండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ తెలిపింది.

By అంజి  Published on  7 Feb 2024 6:48 AM IST
Gruha Jyothi, electricity authorities, consumers, Telangana

'గృహజ్యోతి పథకం కోసం వివరాలివ్వండి'.. ప్రజలకు అధికారుల సూచన

'గృహజ్యోతి' స్కీం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఫ్రీగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకు ఉండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మంగళవారం ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపింది. అద్దెకున్న వారికి ఈ స్కీం వర్తించదంటూ సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో విద్యుత్‌ సంస్థ వివరణ ఇచ్చింది. 'ప్రజాపాలన' కార్యక్రమంలో ఈ పథకానికి 81,54,158 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. గత నెల ఒకటి నాటికి రాష్ట్రంలో 1.31కోట్ల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 2022-23 ఏడాదిలో సగటున నెలకు 200 యూనిట్లలోపు వినియోగించిన ఇళ్లు ఎన్ని ఉన్నాయో డిస్కంలు పరిశీలిస్తున్నాయి.

గృహజ్యోతి పథకం వర్తింపు కోసం వినియోగదారులు వివరాలు సమర్పించాలని విద్యుత్‌ అధికారులు కోరారు. మీటర్‌ రీడింగ్‌ కోసం వచ్చే సిబ్బందికి ఆధార్‌, రేషన్‌ కార్డులు చూపి మీ సర్వీస్‌ (యూఏఎన్‌)నంబర్‌ తో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కరెంట్‌ బిల్లులు తీసేందుకు ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి రేషన్‌, ఆధార్‌కార్డు వివరాలు ఇస్తే వాటిని సర్వీస్‌ నెంబర్‌తో అక్కడే అనుసంధిస్తారని విద్యుత్‌ అధికారులు తెలిపారు.

200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అమలుకు అర్హులను గుర్తించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీ నేతృత్వంలో ఉన్నతాధికారులు నిన్న హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ గాంధీనగర్‌ డివిజన్‌ పరిధిలోని అశోక్‌నగర్‌ సెక్షన్‌లో విద్యుత్‌ వినియోగదారుల ఇళ్లకు వెళ్లారు. ఇంటింటికీ వెళ్లి కరెంటు మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బందితో కలిసి విద్యుత్‌ వినియోగదారుల నుంచి రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబరు సేకరించి స్పాట్‌ బిల్లింగ్‌ మిషన్‌లో నమోదు చేయించారు.

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలో.. సుమారు 1800 మంది కరెంటు మీటర్‌ రీడర్లు ఉన్నారు. వీరంతా ఈ నెల 15 వరకు ఇదే పనిలో ఉంటారని, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అర్హులైన వారికి గృహ జ్యోతి పథకం అమలు చేస్తామని తెలిపారు.

Next Story