ఈ కాలంలో పిల్లలకు, పెద్దలకు తిండి లేకపోయినా బాధ లేదు కానీ.. చేతిలో ఫోన్ మాత్రం తప్పకుండా ఉండాలి. బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా.. తింటున్నా.. చివరికి పడుకున్నా కూడా పక్కనే మొబైల్ ఫోన్ ఉండాలి. ఎప్పుడు చూసినా ఈ ఫోన్ గోల ఏమిటి అని తల్లిదండ్రులు ఎంతో మంది పిల్లలను మందలిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు.. తల్లిదండ్రుల ముందైనా ఫోన్ ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఎప్పుడూ చేతిలో ఫోన్ పెట్టుకుని ఉన్న పిల్లలకు ఎలాగైనా ఆ ఫోన్ పిచ్చి పోవాలని తల్లిదండ్రులు అప్పుడప్పుడు మందలిస్తూ ఉండడం సహజమే..! తాజాగా అలా తల్లిదండ్రులు మందలించడంతో ఓ అమ్మాయి చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తె ఎలాగైనా ఇంటికి రావాలని కోరుకుంటూ ఉన్నారు.
హైదరాబాద్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని గిరిప్రసాద్ కాలనీలో నివాసముంటున్న బోయిన రమాదేవి, నగేశ్ దంపతుల కూతురు ఉదయభాను అదృశ్యమైంది. ఆమె వయసు 20 సంవత్సరాలు. ఉదయభాను ఈసీఐఎల్ పరిధిలోని ఇంటర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఉదయభాను ఎప్పుడూ ఫోన్ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో ఉదయభాను ఇంట్లో చెప్పకుండా ఆదివారం ఉదయం వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌చార్జి సీఐ మధుకుమార్ తెలిపారు. తమ కుమార్తె ఇంటికి వస్తే చాలని వారు కోరుకుంటూ ఉన్నారు. ఆచూకీ తెలపాలని పలువురిని అడుగుతూ ఉన్నారు.