Gadwal: బస్సు బోల్తాపడి చెలరేగిన మంటలు, మహిళ మృతి
తెలంగాణలోని జోగులాండ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 7:26 AM ISTGadwal: బస్సు బోల్తాపడి చెలరేగిన మంటలు, మహిళ మృతి
తెలంగాణలోని జోగులాండ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పి ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దాంతో.. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో మంటల్లో చిక్కుకుని ఓ మహిళా ప్రయాణికురాలు సజీవదహనం అయ్యింది. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు బయల్దేరింది ఈ క్రమంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా ఉండటంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దాంతో.. ఆ బస్సు బోల్తా పడింది. బస్సు కిందపడిపోయిన వెంటనే బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే నిద్రపోతున్న ప్రయాణికులు.. బస్సు బోల్తా పడటంతో ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో అరుపులు మొదలుపెట్టారు.
ఇక బస్సు బోల్తా పడ్డ తర్వాత అందులో ఉన్న ప్రయాణికులు ఎలాగోలా బయటకు వచ్చి తప్పించుకున్నారు. కానీ.. ఒక్క మహిళ మాత్రం బస్సులో నుంచి బయటకు రాలేకపోయింది. బస్సులో చెలరేగిన మంటల్లోనే చిక్కుకుంది. చివరకు అవే మంటల్లో సజీవదహనం అయ్యింది. ఇక ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. కానీ.. అప్పటికే బస్సు దాదాపుగా కాలిపోయింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే సంఘటనలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదసమయంలో బస్సులో 32 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు బోల్తా పడిందనీ ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. ఇక మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.