'అవమానిస్తే.. ఆ ప్రాంతానికి గద్దర్ పేరు పెడతాం'.. బీజేపీకి సీఎం రేవంత్ హెచ్చరిక
పద్మ అవార్డుల విషయంలో దివంగత గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By అంజి Published on 1 Feb 2025 9:07 AM IST'అవమానిస్తే.. ఆ ప్రాంతానికి గద్దర్ పేరు పెడతాం'.. బీజేపీకి సీఎం రేవంత్ హెచ్చరిక
హైదరాబాద్ : పద్మ అవార్డుల విషయంలో దివంగత గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, సంజయ్‌లు గద్దర్‌ను దూషిస్తూనే ఉంటే.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతానని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ అధికారిక జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం గద్దరన్న రాష్ట్రంలోనే ఉందన్నారు.
‘గద్దరన్నను దూషిస్తే.. మీ పార్టీ ఆఫీసు అడ్రస్ చెప్పిన ప్రతిసారీ బలవంతంగా ఆయన పేరు రాయాలని.. ఆ ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతానని’ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయనున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గద్దర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా గంటల తరబడి మండుతున్న ఎండలో ప్రగతి భవన్ బయట వేచి ఉండేలా చేసి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గద్దర్‌ను అవమానించారని గుర్తు చేశారు.
గద్దర్‌ను కించపరిచిన కేసీఆర్‌కు ఏమైందో చూడండి.. ప్రగతి భవన్ గేట్లు, బారికేడ్లు పగలగొట్టి అందరికీ అందుబాటులో ఉండేలా చేశాం.. ఈరోజు కేసీఆర్ తన ఫాంహౌస్‌లో ఎదురు చూస్తున్నారని, ఆయన్ను కలవడానికి ఎవరూ రావడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చరిత్రకారుడు జయధీర్ తిరుమలరావు, విద్యావేత్త 'ఐఐటీ గురువు' చుక్కా రామయ్య, కవి అందెశ్రీ, కవి-గాయకుడు గోరేటి వెంకన్న, కవి గద్దర్‌లకు పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదనలను పంపిస్తే బిజెపి నేతృత్వంలోని కేంద్రం తిరస్కరించిందని ఆయన విమర్శించారు. తిరస్కరణ తెలంగాణను అవమానించడమేనని, వివక్షతో కూడిన చర్యగా అభివర్ణించారు.
గద్దర్‌కు పద్మ అవార్డుకు అర్హత ఏమిటని సంజయ్ ప్రశ్నించారు, గతంలో నక్సలిజంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఉటంకిస్తూ, ఆయనను గౌరవించడం అమరవీరులైన పోలీసు అధికారులను మరియు బిజెపి కార్యకర్తలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండిస్తూ, గద్దర్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవారని, తన గొంతుతో, కార్యాచరణతో సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. 'గద్దర్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ఏర్పాటు చేశామని, వీటి ఎంపిక మార్గదర్శకాలను రూపొందించే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించాం’’ అని రేవంత్ అన్నారు.