రైతులకు శుభవార్త..యాసంగి రైతు భరోసా కోసం నిధుల సమీకరణ పూర్తి

తెలంగాణ రైతులకు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది

By -  Knakam Karthik
Published on : 8 Feb 2026 6:20 PM IST

Congress Government, Tealangana Farmers, Yasangi Rythu Bharosa

రైతులకు శుభవార్త..యాసంగి రైతు భరోసా కోసం నిధుల సమీకరణ పూర్తి

తెలంగాణ రైతులకు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది. నిధుల సమీకరణ కోసం బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా రూ.9,000 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) ఇండెంట్ సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రుణం సేకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సమీకరించనున్నారు. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2,000 కోట్లు, 16 ఏళ్లకు మరో రూ.2,000 కోట్లు, 21 ఏళ్ల కాలపరిమితితో రూ.2,500 కోట్లు, 27 ఏళ్లకు రూ.2,500 కోట్ల చొప్పున ప్రభుత్వం రుణం తీసుకోనుంది. ఈ-వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. అనంతరం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతుల జాబితా కూడా సిద్ధమైనట్లు సమాచారం.

అయితే, ఈ నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఒక స్పష్టత ఇచ్చారు. మిర్యాలగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయినా, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

Next Story