తెలంగాణ రాజకీయాలలో ఈటల రాజేందర్ వ్యవహారం తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే..! టీఆర్ఎస్ చేసింది కరెక్ట్ అని కొందరు అంటూ ఉంటే.. ఈటల రాజేందర్ ను కావాలనే ఇరుకున పెట్టేందుకు ఇలాంటి పనులు చేశారని మరికొందరు భావిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కొందరు ఇష్టమొచ్చిన పదజాలంతో పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఈటల తొలగింపును నిరసిస్తూ కూడా కొందరు పోస్టులు పెట్టడం.. వైరల్ అవ్వడం కూడా జరిగాయి. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా అసభ్య, అనుచిత వ్యాఖ్యలతో వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు ఇతడి గురించి ఆరా తీయగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం జల్మాలకుంటకు చెందిన ధరావత్ శ్రీను నాయక్‌గా తేలింది.
ఓ బేకరీలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న పెన్‌పహాడ్ పోలీసులు సోమవారం రాత్రి యువకుడిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి పెన్‌పహాడ్ ఠాణాకు తీసుకొచ్చారు. అదేమండలానికి చెందిన ధర్మాపురం గ్రామ సర్పంచ్ నెమ్మాది నగేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ధరావత్ శ్రీను అరెస్టును నిరసిస్తూ లంబాడీ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కొంతమంది రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం శ్రీనును విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట రూరల్ సీఐకి వినతిపత్రం అందజేశారు.