కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సడలింపులు ఉన్న రంగాలు తప్పితే.. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో పేద ప్రజలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పేదల కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. జూన్ నెల కోటా కింద రేషన్ కార్డుదారుల కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పేదల ఆకలి తీర్చడంలో సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 35 కేజీలకు అదనంగా మరో పది కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న పది కిలోలకు అదనంగా మరో పది కిలోలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. జూన్ నెలలో అదనపు కోటా సహా సుమారు 4.6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ప్రారంభించనున్నారు.