తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులకు సంబంధించి సీఎస్, విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దు చేసి.. 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అదేవిధంగా ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. జూన్ 1న తరువాత పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఎప్పుడు తెరవాలనే నిర్ణయాన్ని.. అప్పుడు ఉండే పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,08,602 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 8,126 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232 కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 38 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,999కి పెరిగింది. నిన్న 3,307 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,30,304కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి.