తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రబీ సీజన్ రైతు బంధును అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతులకు రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5,000 వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని డిసెంబర్ 28 నుంచి పంపిణీ చేయనుంది. రూ.7,600 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. తత్ఫలితంగా, వ్యవసాయ పెట్టుబడి సాయం మొదట ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలలో వేయబడుతుంది, తరువాత పెద్ద భూమి ఉన్నవారికి దశలవారీగా అందించబడుతుంది.
వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సెలవులకు ముందు మొత్తం పంపిణీ చేయనున్నారు. రైతు బంధు ద్వారా 66 లక్షల మందికి పెట్టుబడి సాయం అందనుంది. ఇక రబీ సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం చేతికి పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.57 వేల కోట్లు రైతుబంధు కొరకు ఖర్చుపెట్టింది. తాజా పంపిణీతో ఇది రూ. 65 వేల కోట్ల మైలురాయికి చేరుకోనుంది. కొత్తగా మరో లక్షమంది రైతు బంధుకు అర్హులయ్యే అవకాశం కనిపిస్తోంది. రైతుబంధు నిధుల్లో ఎలాంటి కోత పెట్టొద్దని, అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో నిధులు జమ చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శికి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు.