Telangana: మళ్లీ ఉప్పొంగుతోన్న మున్నేరు.. వరద హెచ్చరికలు జారీ

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో ఖమ్మం జిల్లా మున్నేరు నదిలో విధ్వంసం జరిగిన వారం తర్వాత తాజాగా వరద ఉధృతంగా మారింది.

By అంజి  Published on  8 Sept 2024 2:30 PM IST
flood alert, Telangana, Munneru River, Khammam

Telangana: మళ్లీ ఉప్పొంగుతోన్న మున్నేరు.. వరద హెచ్చరికలు జారీ

హైదరాబాద్: శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో ఖమ్మం జిల్లా మున్నేరు నదిలో విధ్వంసం జరిగిన వారం తర్వాత తాజాగా వరద ఉధృతంగా మారింది. ఆదివారం మున్నేరులో నీటిమట్టం 16 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి హెచ్చరిక సిగ్నల్‌ను జారీ చేసి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. ఖమ్మం పట్టణం మీదుగా ప్రవహించే నది ఉప్పొంగుతోంది. ఎగువ నుండి భారీ ఇన్ ఫ్లోలు నది ఒడ్డున ఉన్న కాలనీలలో తాజా వరదల భయాన్ని సృష్టించాయి. నీటిమట్టం 24 అడుగులకు చేరితే నీటిపారుదలశాఖ అధికారులు రెండోసారి హెచ్చరికలు జారీ చేస్తారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శనివారం రాత్రి ఖమ్మం చేరుకున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొన్ని సహాయక శిబిరాలను సందర్శించారు. జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఖమ్మం కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ కూడా బాధిత కాలనీలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదివారం పట్టణానికి వచ్ఆరు. సెప్టెంబర్ 1న వచ్చిన వరదల్లో మున్నేరుతో పాటు పలు కాలనీలు నీట మునిగాయి, నిర్వాసితులు తీవ్రంగా నష్టపోయారు.

మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరులో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. దన్వాయిగూడెం, రమణపేట్, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు సమీపంలోని సహాయ శిబిరాలకు తరలించాలని సూచించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, గార్ల, బయ్యారం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు వాగుపై ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై భారీగా వరద ఉధృతంగా ప్రవహించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు. మహబూబాబాద్‌లో 18.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తల్లాడలో 12.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దుకూరులో 9.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

గత వారం ఖమ్మం, మహబూబాబాద్, పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టించాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, పంటలు, రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లు, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్‌లు, నీటిపారుదల ట్యాంకులకు భారీ నష్టం వాటిల్లింది.

------------------------------------------------------

Next Story