ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. నేటి నుంచి ఆ కార్డు చూపించాల్సిందే
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు శుక్రవారం నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది.
By అంజి Published on 15 Dec 2023 1:06 AM GMTఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. నేటి నుంచి ఆ కార్డు చూపించాల్సిందే
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ నుండి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్, ఆర్డీనరీ బస్సుల్లో బాలికలు, యువతులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ప్రీ జర్నీ చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగపోగా.. టికెట్‌లు కూడా ఇవ్వలేదు.
రోజూ ఎంతమంది ఫ్రీ జర్నీ చేశారనే వివరాలను కండక్లర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో కచ్చితమైన సంఖ్య లేకుండా పోయింది. ఫ్రీ బస్సు జర్నీ పథకంలో అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగానే పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శుక్రవారం నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధ్రువీకరణను తెలిపే ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అంశంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని డిపోల మేనేజర్లు, ఇతర ఉద్యోగులకు పలు సూచనల్ని ఇచ్చారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రతీ రోజూ ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఎంత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందనే లెక్కల ఆధారంగానే ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. అందువల్లే జీరో టికెట్ అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే.. కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లోని అన్ని రకాల బస్సులు కలిపి సగటున 3.50 లక్షల కిలోమీటర్ల మేర నడుస్తుండగా ఇందులో అత్యధికంగా 207 ఎక్స్‌ప్రెస్‌లు, 459 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో రోజుకు సగటున అన్ని బస్సుల్లో కలిపి 2.60 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్తున్నారు.