పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. జీవో విడుదల

తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  8 Dec 2023 11:45 AM GMT
free journey, women,  telangana, govt GO,

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. జీవో విడుదల

తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై జీవో విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజా నిర్ణయంపై రాష్ట్రంలో ఉన్న మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో ఉన్న బాలికలు, మహిలలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఫ్రీ జర్నీ కల్పిస్తోంది. అయితే.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తాము అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండోరోజే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మహిళా ప్రయాణికుల చార్జీ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఇక నుంచి వయసుతో సంబంధం లేకుండా మహిళలంతా ఉచితంగా ప్రయానం చేయొచ్చు.

ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని.. ఈ మేరకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు.


Next Story