ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్
అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 5 Nov 2024 8:00 AM IST
ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్
అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఏక ఉపాధ్యాయుడున్న పాఠశాలలు మూత పడుతున్నాయని భావించి ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మంది నియామకాలకు పూర్తి చేసినట్టు చెప్పారు. చదువు, సామాజిక బాధ్యతపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
విద్యార్థినీ విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా రాణించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించడంలో ముఖ్యంగా యువత కృషి చేయాలని కోరారు.
ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మంచిర్యాల నుంచి శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు తరలివచ్చి సీఎంని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం.. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలను వివరించారు.
ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం, స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు వంటి పలు అంశాలను తెలిపారు. డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి యువజన సంఘాలు చొరవ చూపాలని, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడొద్దని కోరారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దని, విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని హితవు చెప్పారు.