Hyderabad: ట్రాయ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు.. బీ అలర్ట్ అంటోన్న పోలీసులు
సైబర్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా సైబర్ నేరగాళ్ల ట్రాయ్ (TRAI) పేరుతో అమాయకమైన జనాలను మోసం చేస్తున్నారు.
By అంజి Published on 22 May 2024 2:26 PM GMTHyderabad: ట్రాయ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు.. బీ అలర్ట్ అంటోన్న పోలీసులు
హైదరాబాద్: ఆన్‌లైన్ సైబర్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా సైబర్ నేరగాళ్ల ట్రాయ్ (TRAI) పేరుతో అమాయకమైన జనాలను మోసం చేస్తున్నారు. TRAI (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) పేరుతో అమాయకమైన బాధితులకు ఫోన్ చేసి.. దేశ వ్యతిరేక మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారని, మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. బాధితుల వద్ద నుండి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ట్రాయ్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న పలు మోసాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయని డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు రైల్వేస్& రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో అమాయకమైన జనాలకు ఫోన్ చేసి ఈ ఆధార్ కార్డు మీదేనా అని అడిగి, ఈ నెంబర్ తో డ్రగ్స్ పార్సిల్స్ వచ్చాయని లేదా దేశ వ్యతిరేక మోసపూరిత కార్యక్రమాలకు సంబంధించిన సందేశాలు పంపిస్తున్నారని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
అంతేకాకుండా మోసగాళ్లు బాధితులు నమ్మే విధంగా స్కైప్ ద్వారా వీడియో కాల్ లో యూనిఫాంలో ఉన్న ఓ నకిలీ పోలీస్ వ్యక్తిని చూపించి ఇతర వివరాలతో పాటు మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామంటూ, నకిలీ ఎఫ్‌ఐఆర్ చదువుతారు. మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఉండాలంటే మేము చెప్పిన విధంగా ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటూ డిమాండ్ చేస్తారు. ఈ విధంగా అమాయకమైన బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలా చాలామంది సైబర్ నేరగాళ్లు వలలో చిక్కుకొని లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డామని రైల్వే మరియు రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు.
ఎవరైనా తెలియని నెంబర్ నుండి కాల్స్ వస్తే వాటిని లిఫ్ట్ చేయకూడదని, మీ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ ఫోన్ కి సంబంధించి కానీ ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకూడదని, అంతే కాకుండా ఎవరైనా మీకు కాల్ చేసి మిమ్మల్ని అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అటువంటి మాటలు నమ్మకూడదని అన్నారు. మోసగాళ్ల కాల్ రికార్డు చేయండి లేదా స్క్రీన్ షాట్ తీయండి అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి లేదా డయల్ 1930 లేదా www.cybercrime.gov.in లాగిన్ చేసి ఫిర్యాదు చేయండి అంటూ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ జనాలకు విజ్ఞప్తి చేశారు.