తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న ఫాక్స్‌కాన్

తెలంగాణలో మెగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఫాక్స్‌కాన్ ప్రకటించింది.

By అంజి  Published on  2 March 2023 2:45 PM GMT
Foxconn, Telangana

సీఎం కేసీఆర్‌, ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు

హైదరాబాద్: రాష్ట్రానికి మరో మెగా పెట్టుబడి వచ్చింది. తెలంగాణలో మెగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఫాక్స్‌కాన్ ప్రకటించింది. ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత గురువారం ఈ ప్రకటన వెలువడింది. ఫాక్స్‌కాన్ తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లియుతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో సౌకర్యాల ఏర్పాటును ప్రకటించారు. చారిత్రాత్మక ఒప్పందం 10 సంవత్సరాల కాలంలో లక్ష మందికి పైగా ఉపాధిని సృష్టించే అవకాశం ఉంది.

ప్రతిపాదిత సౌకర్యాల కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్), తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, బంగారు తెలంగాణ దార్శనికతను సాకారం చేసేందుకు అనేక పథకాలు చేపట్టామని కేసీఆర్ చెప్పారు. "ఫాక్స్‌కాన్ యూనిట్ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంలో సహాయం చేస్తుంది. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను ఆకర్షించడంలో సహాయపడుతుంది" అని కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ తైవాన్‌ను సహజ భాగస్వామిగా పరిగణిస్తోందని, ఫాక్స్‌కాన్ వృద్ధి కథనంలో రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు. ప్రతిపాదిత యూనిట్‌తో లక్ష మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు సంతోషం వ్యక్తం చేశారు.

వైవిధ్యభరితమైన ఎలక్ట్రానిక్స్ తయారీ యొక్క ప్రాముఖ్యత

స్థిరమైన సప్లై చైన్‌ కోసం ఎలక్ట్రానిక్స్ తయారీని వైవిధ్యపరచడం, రాష్ట్ర ప్రభుత్వాలు పోషించాల్సిన కీలక పాత్ర గురించి కేసీఆర్, మిస్టర్ లియు చర్చించారు. నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విజయవంతమైందని, తెలంగాణలో పెట్టుబడులను భారీగా ఆకర్షించామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం రావడం అభినందనీయమని అన్నారు. స్థానిక తెలంగాణ యువతకు వీలైనంత వరకు లక్ష ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని లియుకు ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన స్నేహపూర్వక పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను ఆయన కొనియాడారు. కేవలం ఎనిమిదేళ్లలో పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఐటీ, సంబంధిత ఎలక్ట్రానిక్స్ రంగాలలో తెలంగాణ సాధించిన పురోగతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ కంపెనీ పెట్టుబడులపై ఆశాజనకంగా ఉన్నట్టు ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలిపారు.

ఇవాళ మిస్టర్ లియు పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు కేసీఆర్ అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. లియుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో లియు, ఆయన బృందానికి సీఎం భోజనం ఏర్పాటు చేశారు.


Next Story