ఫార్ములా - ఈ కారు రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏసీబీ ఎదుట హాజరుకానున్నారు. యూకేకు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.45.71 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్టు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ విచారణకు రావాలంటూ ఈ నెల 3వ తేదీన కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఈ నెల 7వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపిన విషయం తెలిసింది.
కేటీఆర్‌ను ఇవాళ ఏసీబీ విచారించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శి మేకల విద్యాసాగర్‌ను అర్ధరాత్రి అరెస్టు చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 100 మంది బీఆర్‌ఎస్వీ నాయకులను అక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. విచారణ పేరుతో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు.