మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. పార్టీకి రాజీనామా చేసిన‌ బూర న‌ర్స‌య్య గౌడ్‌

Former MP Boora Narsaiah Goud resigns from TRS party membership.మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్‌కి భారీ షాక్ త‌గిలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Oct 2022 5:03 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. పార్టీకి రాజీనామా చేసిన‌ బూర న‌ర్స‌య్య గౌడ్‌

మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ‌ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌)కి భారీ షాక్ త‌గిలింది. సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్‌ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

2014 లోక్‌సభ ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటి చేసి విజ‌యం సాధించారు. 2019లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేతిలో ప‌రాజ‌యం పాలైయ్యారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక టికెట్ ఆశించారు. అయితే.. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో అసంతృప్తికి లోనైయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా ఒక మాజీ ఎంపీ అయినప్పటికీ , ఒక్క సారి కూడా మాతో సంప్రదించలేదు. నియోజకవర్గం లో జరిగిన ఆత్మగౌరవ సభలలో, మాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగి ఉన్నాను. అది మీకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదు, కానీ బీసీ సామజిక వర్గానికి టిక్కెట్ పరిశీలించండి అని అడగటం కూడా నేరమే అయితే అసలు ఈ పార్టీలో ఉండటమే అనవసరం. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య , రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం. మీరంటే అభిమానం, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతో ఇప్పటి వరకు ఉన్నాను, కానీ అభిమానానికి , బానిసత్వానికి చాల తేడా ఉంది. నేను వ్యక్తిగతంగా అవమాన పడ్డా, అవకాశాలు రాకున్నా పర్వాలేదు. కానీ అట్టడుగు వర్గాల సమస్యలు కనీసం మీ దృష్టికి తీసుకు వచ్చే అవకాశమే లేనప్పుడు, నేను తెరాస పార్టీలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు అని బూర న‌ర్స‌య్య గౌడ్ అన్నారు.

Next Story
Share it