బీజేపీకి బిగ్‌ షాక్‌.. మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ రాపోలు రాజీనామా

Former MP Ananda Bhaskar Rapolu resigns from BJP. మునుగోడు ఉప ఎన్నికల వేళ.. తెలంగాణ బీజేపీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ

By అంజి  Published on  26 Oct 2022 12:42 PM IST
బీజేపీకి బిగ్‌ షాక్‌.. మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ రాపోలు రాజీనామా

మునుగోడు ఉప ఎన్నికల వేళ.. తెలంగాణ బీజేపీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ రాపోలు రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి దృక్పథాన్ని ప్రదర్శించి, తెలంగాణకు దక్కాల్సిన అనేక అవకాశాలను లాక్కుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బుధవారం రాసిన లేఖలో ఆనంద భాస్కర్ అన్నారు. 'సానుకూల లౌకికవాదం' అనే దాని ప్రస్తావనకు కట్టుబడి ఉందా లేదా అని బిజెపి ఆత్మపరిశీలన చేసుకోవాలని రాపోలు ఆనంద భాస్కర్‌ అన్నారు. గత నాలుగేళ్లుగా తనను విస్మరించారని, అవమానించారని, తక్కువ అంచనా వేయారని, జాతీయ పాత్రల్లో తనను తప్పించారని అన్నారు.

''స్వర్గీయులు అరుణ్‌జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్‌ 4న మీ పార్టీలో చేరా. ఇంతకాలం పార్టీలో మీలాంటి మహానుభావులతో కలిసి ఉండే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. భారతీయ జనతాపార్టీ (బీజేపీ)నుంచి నేను ఈ క్షణం నుంచి దూరమవుతున్నాను. పార్టీలో చేరే సమయంలో నేను ఒక ప్రకటన చేశాను. వాటిలో కొన్నింటిని కింద పొందుపరుస్తున్నా'' అని లేఖలో పేర్కొన్నారు.

"ఆధునిక యాంత్రిక సమాజం కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్నది. ఇలాంటి సమయంలో భారతీయుల్లో దేశభక్తి, జాతీయవాదం అనేది ఎంతో ముఖ్యం. రాష్ట్రాల్లోని స్థానిక ప్రజల గౌరవాన్ని కాపాడితేనే దేశానికి గుర్తింపు. భారతీయ ఆత్మ, జాతీయత భావన అనేవి ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. అప్పుడే దేశ సమగ్రత, ప్రాదేశిక భద్రత పరిపుష్టమౌతుంది. పార్టీ నియమాలను శ్రద్ధగా చదివిన వాడిని. అందులో బీజేపీకి "సానుకూల లౌకికవాదం" ఖశ్చితంగా శిరోధార్యం అని నిర్ధారించారు. అంటే వసుదైవ కుటుంబ భావనకు పార్టీ పెద్దపీట వేస్తుందనుకొన్నా.. ఈ సూత్రానికి ఆ పార్టీ నిజంగా కట్టుబడి ఉన్నదా?'' అంటూ లేఖలో రాపోలు ప్రశ్నించారు.

లేఖలో.. ''గ్రేట్‌ బ్రిటన్‌ జనాభాలో భారత సంతతికి చెందిన వారు 3 శాతమే. అయినప్పటికీ, భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధానిగా నియమితులయ్యారు. మరో అగ్రరాజ్యం అమెరికాకు భారత సంతతికి చెందిన మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఇలా ఉండగా.. మన దేశంలో ఎలాంటి తరహా ఇబ్బందికరమైన విచ్చిన్నకర రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయి? సమగ్ర మానవతావాదం, అంత్యోదయ భావనలను పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ సూచించారు. ఈ విశిష్ట లక్ష్యాలను చేరడానికి పార్టీలో ఏ కొసైనా నిబద్ధత కనిపిస్తున్నదా? అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల ప్రియతమ నాయకుడు స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయీ రాజధర్మాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. సహకార సమాఖ్యవాదంలో ఆయన పిలుపును ఎప్పుడైనా అనుసరించారా? రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సమాజంలో చీలికలు తీసుకురావడమే పార్టీకి నిత్యకృత్యంగా మారింది.''


Next Story