హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. రెండేళ్ల విచారణలో లీకులు ఎందుకు ఇస్తున్నారని సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించానన్నారు. పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని అడిగానని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. ఇవాళ తన విచారణతో మంత్రులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు తేలిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదే పదే అడిగారని తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని, తానూ వస్తానని చెప్పినట్టు వెల్లడించారు. ఈ అక్రమ కేసుకు తామూ భయపడే ప్రసక్తే లేదని, ఇది లీకువీరుల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేయడం లేదా అని సిట్ అధికారులను అడిగితే నీళ్లు నమిలారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ఏవో కొన్ని పేర్లు చెప్పి వారు తెలుసా? వీరు తెలుసా? అని అడిగారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని దుష్ప్రచారం చేశారు. అది నిజమేనా అని అడిగితే సమాధానం ఇవ్వలేదు' అని వెల్లడించారు.