తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలోని ఫుడ్ పాయిజన్ జరిగింది. కళాశాలలో గురువారం రాత్రి ఇరవై మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఉపాధ్యాయులు కళాశాల ఆవరణకు తరలించి చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. నిన్న విద్యాలయంలో వండిన వంట తినడం వల్లే అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు వాపోతున్నారు.
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ చంద్రబాబు స్పందిస్తూ.. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అంగీకరించారు. అయితే అది ఫుడ్ పాయిజన్ వల్ల సంభవించింది కాదని అన్నారు. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లిన విద్యార్థులు తమతో పాటు కొంత ఆహారం తీసుకుని వచ్చారని, అది తినడం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన పిల్లలకు తక్షణమే చికిత్స అందిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖమ్మం డీహెచ్‌ఎంవో మాలతి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరిశీలించారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.