Telangana: నేడు వరద బాధితుల అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 6 Sep 2024 1:42 AM GMTతెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పూర్తిగా నీటమునిగింది. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వరద ముంచెత్తింది. గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేల కోట్ల ఆస్తులు.. ఎన్నో ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. పలువురు ముంపు బాధితులు రోడ్డు మీద పడ్డారు. కాగా.. వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఆయా చర్యలను ముమ్మరం చేసింది. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, పాడి పశువులు చనిపోతే రూ.50వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5వేల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకారకు రూ.10 వేల పరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే వరద బాధితులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
వరద సాయం డబ్బులను శుక్రవారం నుంచి బాధితుల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు మంత్రి తుమ్మల. వరద బాధితుల బ్యాంకు అకౌంట్లలో రూ.10 వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు. వరదల్లో ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నవారికి ఇందిరమ్మ పథకం ద్వారా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తాన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 7 వేలకు పైగా ఇంట్లు వరదల్లో పూర్తిగా మునిగిపోయాయని మంత్రి తుమ్మల అన్నారు. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక వరదల వల్ల నష్టోయిన ఇళ్లు, పంట సహా పాడిపశువుల విషయంలో వివరాలను సేకరించిన తర్వాత డబ్బులు అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. శుక్రవారం నుంచి మాత్రం వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.