దేశానికి వెన్నముక రైతు అని అంటారు. అలాంటి రైతన్న బాధలు వర్ణానాతీతం. అప్పుల బాధతో సతమతమవుతున్నాడు. అన్నం పెట్టే రైతన్నపై జాలి చూపకుండా.. వారి పరువు తీశారు మెదక్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు. రుణాలు చెల్లించలేదని పాపన్నపేట మండలంలో రైతుల పేర్లు, ఫోటోలతో నడి వీధిలో ఫెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు రైతులు వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం గతంలో రుణాలు తీసుకున్నారు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఇటీవల రైతులపై ఒత్తిడి తెచ్చారు బ్యాంకు అధికారులు.
అయితే.. గత ఏడాది కరోనా విజృంభణ, భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అప్పులు తీర్చడానికి సమయం ఇవ్వాలని రైతులు కోరారు. అయినప్పటికి వారి మాటలను పట్టించుకోని అధికారులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. వెంటనే అప్పు కట్టకపోతే భూములు వేలం వేస్తామని, ఎర్ర జెండాలు పాతుతామని అధికారులు బెదిరిస్తున్నారని రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు. పంట డబ్బు చేతికి వచ్చిన తరువాత అప్పులు చెల్లిస్తామని.. అప్పటి వరకు ఓపిక పట్టాలని మానసికంగా చంపొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బకాయిదారుల ఫొటోలతో ఫ్లెక్సీలు ప్రింట్ చేయించామని బ్యాంకు అధికారులు అంటున్నారు. చాలా ఏళ్లుగా రుణాలు కట్టని, వేలానికి వచ్చిన వాటికి సంబంధించి ఫ్లెక్సీ వేశారని చెప్పారు. ఎంతో కొంత మొత్తం కడితే గడువు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. బుధవారం వరకే ఈ అవకాశం ఉందంటున్నారు.