భూమిని చదును చేస్తున్నప్పుడు విలువైన వస్తువులు బయటపడడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో భూమిని చదును చేస్తుంగా.. లంకె బిందె దొరికింది. అందులో 17తులాల బంగారం, 10 కిలోల వెండి ఉంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన నర్సింహా అనే వ్యక్తి పెంబర్తి గ్రామ పరిధిలో 11 ఎకరాల భూమిని కొన్నాడు. ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. అందుకోసం జేసీబీతో భూమిని చదును చేస్తుండగా రెండు లంకె బిందెలు కనిపించాయి.
వెంటనే అతను అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. లంకబిందెలను తెరచి చూడగా.. 17 తులాల బంగారం, 10 కిలోల వెండి ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ భాస్కరరావు, తహసీల్దారు రవీందర్, గ్రామ సర్పంచి ఆంజనేయులు, పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. కాగా.. దీనిపై నర్సింహా మాట్లాడుతూ.. తనకు గత కొద్ది రోజులుగా అమ్మవారు కలలో కనిపిస్తోందన్నారు. దీంతో తన భూమిలో అమ్మవారి గుడిని కట్టించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.