తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. ఈ నెల 25న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌తో కూడిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటీస్ జారీ చేసి, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. వార్డులు, పంచాయతీల వారీగా ఓటరు జాబితా నామినేషన్ల దాఖలు కేంద్రంలో ప్రచురిస్తారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి ఆ గ్రామంలో, వార్డు సభ్యుడిగా చేసేందుకు ఆ వార్డులో ఓటరై ఉండాలి.
మొదటి విడతలో 189 మండలాల్లోని 4,236 పంచాయతీలు, 37 వేల 450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమయం ముగుస్తుంది. ఈ నెల 30న నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబరు 1న అప్పీళ్లు స్వీకరించి మరుసటి రోజున పరిష్కరిస్తారు. డిసెంబరు 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.