వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల సీబీఐ విచారణ ముగిసింది. వీరిని హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. రేపు మళ్లీ వీరిని విచారణకు తీసుకురానున్నారు. అవినాశ్ రెడ్డి విచారణ ఇంకా కొనసాగుతోంది. సాక్ష్యాల తారుమారు గురించి భాస్కర్ రెడ్డి, ఉదయ్ లను సీబీఐ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 40 కోట్ల డీల్ జరిగిందన్న దస్తగిరి ఆరోపణలపై కూడా ప్రశ్నించారని సమాచారం. ఈ ఉదయం బీపీ కారణంగా భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చంచల్ గూడ జైల్లోనే ఆయనకు చికిత్స అందించనున్నారు.
ఈరోజు ఉదయం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అవినాశ్ ను ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని మంగళవారం తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేయడంతో నేడు సీబీఐ అధికారుల ముందు ఆయన హాజరు అయ్యారు. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 25వ తేదీన తీర్పు రానుంది. సీబీఐ సమన్లు, కోర్టు ఆదేశాల మేరకు అవినాశ్ సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అధికారులు తమ ప్రశ్నలను లిఖితపూర్వకంగా అవినాశ్ కు అందజేశారు.