చంచల్ గూడ జైలులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత.. సీబీఐ విచారణపై సందిగ్ధత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి
By అంజి Published on 19 April 2023 11:20 AM IST
చంచల్ గూడ జైలులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత.. సీబీఐ విచారణపై సందిగ్ధత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చంచల్‌గూడ జైలులో ఉన్న భాస్కర్‌రెడ్డిని, ఉదయ్‌కుమార్‌ను ఇవాళ ఉదయం 9 గంటల నుంచి విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ సమయంలో భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం బయటకు వచ్చింది. భాస్కర్‌రెడ్డి బీపీ పెరిగింది. అయితే సీబీఐ అధికారులు.. ఇవాళ భాస్కర్‌రెడ్డిని విచారిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. భాస్కర్‌రెడ్డి వైద్య పరీక్షలు చేసి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారని సమాచారం.
వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భారతి మేనమామ అయిన భాస్కర్‌రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేసింది. వివేకా హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పులివెందులలో అదుపులోకి తీసుకున్న భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీబీఐ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆ సమయంలో కూడా భాస్కర్‌రెడ్డికి బీపీ పెరిగింది. అయితే న్యాయమూర్తి.. భాస్కర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఈ కేసులో దర్యాప్తు సీబీఐ ముమ్మరం చేసింది. భాస్కర్‌రెడ్డి కుట్రదారుడిగా సీబీఐ అభియోగాలు మోపింది. వివేకా గుండెపోటుతో చనిపోయారని భాస్కర్‌రెడ్డి ప్రచారం చేశారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. సాక్ష్యాలు దొరక్కకుండా ఉండేలా చేయడంలో అతడి పాత్ర ఉందని అధికారులు అంటున్నారు. మరోవైపపు ఈ నెల 25వ తేదీన అవినాష్‌రెడ్డిపై తీర్పు వెల్లడిస్తామని నిన్న తెలంగాణ హైకోర్టు తెలిపింది. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.