Kamareddy: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 8:30 AM ISTKamareddy: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అయ్యప్ప షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో స్థానికంగా ఉన్న ప్రజలు పరుగులు తీశారు. వారిలో కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైరింజన్లను తీసుకుని అగ్నిప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో షాపింగ్ మాల్ అన్ని అంతస్తులకు అంటుకున్నాయి.
అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రెండు అంతస్తుల్లో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఆ తర్వాత షాపింగ్ మాల్ షెట్టర్లను జేసీబీ సాయంతో ఓపెన్ చేశారు. మరో రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. షాపింగ్ మాల్‌లో ఉన్నట్లుండి మంటలు ఎందుకు వ్యాపించాయనేది తెలియరాలేదు. అగ్నిప్రమాదం అర్ధరాత్రి జరగడం..ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మాల్‌లోని నాలుగు అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో పూర్తి సరుకు అంతా కాలిపోయింది. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని మాల్ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.