తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా మటన్ ముక్క తప్పనిసరి. ఫంక్షన్ విందులో ముక్కలు వేయకపోతే పెద్ద పెద్ద గొడవలే జరుగుతుంటాయి. మటన్ ముక్కల కోసం గొడవలేందీ బయ్ అని ఇతర ప్రాంతాల వారు అనుకొవచ్చు కానీ.. తెలంగాణలో మాత్రం మటన్ ముక్క కోసం జరిగే గొడవలు కామన్. తాజాగా ఎంతో సంతోషంగా జరుగుతున్న వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చు పెట్టింది. మద్యం సేవించిన వరుడు తరపు బంధువులు భోజనానికి కాస్త ఆలస్యంగా వచ్చారు. అప్పటికే మటన్ కూర అయిపోవడంతో ఇదే విషయాన్ని చెప్పారు.
ఈ క్రమంలోనే తమకు మటన్ కూర వేయలేదని పెళ్లి కొడుకు బంధువులు వడ్డిస్తోన్న వారిపై వంట సామగ్రి, టేబుళ్లతో దాడి చేశారు. తిరిగి పెళ్లి కూతురు బంధువులు కోపంతో ఎదురు దాడి చేయడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ గొడవ వల్ల ఆ వివాహ తంతు రసాభాసగా నిలిచింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఆత్మకూరులో జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుడి తరఫు బంధువుల ఏడుగురిపై, వధువు తరఫు బంధువుల 9 మందిపై కేసు నమోదు చేశారు.