తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ అడ్మీషన్స్ అండ్ ఫీ రెగ్యూలేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్‌సి) సిఫారసులకు ఆమోద ముద్ర వేసింది. గరిష్ట ఫీజు రూ.1.60లక్షలు కాగా.. కనిష్ట పీజును రూ.45వేలుగా నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో-37ను జారీ చేశారు. ఈ ఫీజులు మూడేళ్ల పాటు అమల్లో ఉండనున్నాయి. అంటే.. ఈ విద్యా సంవత్సరంతో పాటు 2023-24, 2024-25ల్లో ప్రవేశాలు పొందే వారికి వర్తించనున్నాయి.
రాష్ట్రంలోని 159 ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు ఎంటెక్ బోధించే 76 కాలేజీలకు కూడా ఫీజులను ఖరారు చేసింది. బీటెక్ కోర్సుకు కనిష్ట ఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంచారు. ఎంటెక్ కనిష్ట ఫీజు రూ.27వేలు ఉండగా, గరిష్ట ఫీజును రూ.1.10లక్షలుగా నిర్ణయించారు. ఎంసీఏలో కనిష్ఠ ఫీజు రూ.27 వేలు, గరిష్టంగా రూ.95 వేలు, ఎంటెక్ ఫీజు కనిష్ఠం రూ. 57 వేలు, గరిష్ఠం రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉండనున్నాయి.
ఎంజీఐటీలో రూ.1.08లక్షల నుంచి రూ.1.60లక్షలకు చేరింది. ఏస్ కాలేజీలో ఫీజు రూ.38వేలు, బీవీఆర్ఐటీలో రూ.45వేలు, సీవీఆర్‌లో రూ.35వేలు చొప్పున పెరిగాయి. అయితే.. కొన్ని కాలేజీల్లో ఒక్క రూపాయి కూడా పెరగలేదు. కేఎంఐటీ, కిట్స్ వరంగల్‌లో పాత ఫీజునే వసూలు చేస్తారు. లక్షకు పైగా ఫీజులు ఉన్న కాలేజీల సంఖ్య గతంలో 20 ఉండగా తాజా పెంపుతో 33కి చేరింది.
ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందంటే..?