కరీంనగర్‌లో కవల పిల్లల హత్య కేసు ఛేదన..తండ్రి సహా నలుగురు అరెస్ట్
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్‌లో కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By - Knakam Karthik |
కరీంనగర్‌లో కవల పిల్లల హత్య కేసు ఛేదన..తండ్రి సహా నలుగురు అరెస్ట్
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్‌లో కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తండ్రి శ్రీశైలంతో పాటు అతనికి సహకరించిన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
శ్రీశైలంకు 2022లో కవల ఆడపిల్లలు జన్మించారు. అయితే, ఆడపిల్లలు పుట్టారనే నెపంతో అప్పటి నుంచే భార్యను వేధింపులకు గురిచేసేవాడు. అనేకసార్లు గొడవలు జరిగినప్పటికీ, కాలక్రమేణా అన్నీ సర్దుకున్నాయని భావించిన సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కవల పిల్లలిద్దరినీ అత్యంత క్రూరంగా బావిలోకి తోసి చంపేశాడు. ఒక చిన్నారి నీటిలో మునిగిపోగా, మరో పాప మోటార్ పైపును పట్టుకుని ప్రాణాల కోసం అరుస్తుండటం చూసి కూడా శ్రీశైలంలో కనికరం కలగలేదు. వెంటనే బావిలోకి దూకి ఆ చిన్నారిని కూడా నీళ్లలో ముంచి హతమార్చాడు.
హత్య అనంతరం ఏమీ ఎరగనట్టు కేకలు వేస్తూ నాటకమాడాడు. అయితే, భార్య అతడిని నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. గ్రామస్థులు అతడిని పట్టుకోవాలని చూసినా తప్పించుకున్నాడు. చివరకు పోలీసులు పక్కా సమాచారంతో ప్రధాన నిందితుడు శ్రీశైలం సహా, అతని కుటుంబ సభ్యులు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆడపిల్లలనే కారణంతో పసిగుడ్డులను పొట్టనబెట్టుకున్న ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.