వైర‌ల్ : కూతురు బతికుండగానే పిండం పెట్టిన తండ్రి.. ఎందుకంటే

Father conduct final rites Daughter over Love marriage.ప్రేమ‌.. ఎవ్వ‌రి మ‌ధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2022 3:35 PM IST
వైర‌ల్ : కూతురు బతికుండగానే పిండం పెట్టిన తండ్రి.. ఎందుకంటే

ప్రేమ‌.. ఎవ్వ‌రి మ‌ధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. ఇటీవ‌ల కాలంలో ప్రేమ వివాహాలు అధికం అయ్యాయి. కొంద‌రు పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం పెద్ద‌ల‌ను ఎదిరించి వివాహం చేసుకుంటున్నారు. ఎంతో గారాభంగా పెంచుకున్న కుమారై త‌మ‌ మాట కాద‌నడంతో కొంద‌రు త‌ల్లిదండ్రులు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. అమ్మాయిపై దాడి చేయ‌డ‌మో.. లేకుంటే అల్లుడిని హ‌త‌మార్చిన‌టువంటి ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం. తాజాగా ఓ తండ్రి కుమారై ప్రేమ వివాహాం చేసుకోవ‌డాన్ని తట్టుకోలేక క‌ఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుమారై బ‌తికుండ‌గానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దిన క‌ర్మ‌లు కూడా నిర్వ‌హించాడు. ఈ ఘ‌ట‌న మ‌హాబూబ్ న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి కి అదే గ్రామానికి చెందని వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ స‌మీప బంధువులే కావ‌డంతో త‌మ ప్రేమ‌ను పెద్ద‌ల‌కు తెలియ‌జేశారు. త‌మ‌కు పెళ్లి చేయాల‌ని వారిని కోరారు. అయితే.. పెద్ద‌లు అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో వారు ఈ నెల 13న పెద్ద‌ల‌కు తెలియ‌కుండా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న త‌న కూతురు త‌మ మాట కాద‌ని ప్రేమ వివాహాం చేసుకోవ‌డంతో భార్గ‌వి తండ్రి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నాడు. త‌న దృష్టిలో త‌న కుమారై చ‌నిపోయింద‌ని.. ఇక త‌న‌కు ఆమెకు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చి చెప్పాడు. కుమారై చ‌నిపోయింద‌ని గుండు గీయించుకుని ఆమె క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించాడు. అంతేకాదు.. కుమారై చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి శ్ర‌ద్దాంజ‌లి కూడా ఘ‌టించాడు. కుమారై బ‌తికుండానే ఆ తండ్రి చేసిన ప‌ని ఆ గ్రామంలోనే చ‌ర్చ‌నీయాంశమైంది. ఇక సోష‌ల్ మీడియాలో సైతం ఈ ఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. కొంద‌రు తండ్రి చేసిన ప‌నికి మ‌ద్ద‌తుగా కామెంట్లు పెడుతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం కుమారై పై కోపం ఉండొచ్చు కానీ ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు.

Next Story