మెదక్ జిల్లా శివ్వంపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మార్వో ఆఫీస్‌లో రైతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆగ్రహంతో ఎమ్మార్వోపై కూడా డీజిల్ పోశారు అన్నదాతలు. మంగళవారం జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. శివంపేట మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన మాలోత్ బాలు(32) తన పొలంలో సోమవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. అతడికి 10 ఎకరాల భూమి ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదని, ఇచ్చి ఉంటే ఆయనకు రైతుభీమా పరిహారం, రైతుబంధు సాయం వచ్చేదని రైతులు తెలిపారు.
మంగళవారం రైతులంతా మాలోత్ బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో కొంత మంది రైతులు తమ వెంట తెచ్చుకున్న డీజిల్‌ను తహసీల్దార్ బానుప్రకాశ్ తలపై పోశారు. కొంత మంది తమపైనా పోసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ప్రజా ప్రతినిధులు అక్కడకు చేరుకుని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.