హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రైతు రుణమాఫీపై జీవో, విధి విధానాలు వస్తాయని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల ఐతు రుణమాఫీ చేస్తామని చెప్పామన్నారు. కేబినెట్ భేటీలో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. త్వరలోనే రైతులు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని వెల్లడించారు. భవిష్యత్ లో వ్యవసాయాన్ని పండగ లాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు.
రైతన్నలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ మాట నిలుపుకున్న సందర్భంలో రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ సర్కార్.. నిధుల సమీకరణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. రూ.10 వేల కోట్ల మేర రుణాలు సేకరించేందుకు ఆర్బీఐ అనుమతి కోరింది. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం బిజీగా ఉంది.