మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు: సీఎం రేవంత్‌

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అధికారుకుల సూచించారు.

By అంజి  Published on  29 Sept 2024 6:25 AM IST
Family digital card, home owner, CM Revanth, Telangana

మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అధికారుకుల సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.

సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో డిజిటల్ కార్డుల అమలుపై చేసిన అధ్యయన వివరాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ప్రస్తుత రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వివరాలు అవసరం లేదన్నారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఏ ఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలని, మంత్రివర్గ ఉప సంఘం సూచనలకు అనుగుణంగా సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

అక్టోబర్ 3 వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి (డోర్ టు డోర్) పరిశీలన పూర్తి చేయాలని అధికారకుల సీఎం రేవంత్‌ ఆదేశాలిచ్చారు.

Next Story