Hyderabad: కుషాయిగూడలో నకిలీ స్కూల్
అసలు స్కూల్ పేరుతో నకిలీ స్కూల్ వెలసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.
By అంజి
Hyderabad: కుషాయిగూడలో నకిలీ స్కూల్
హైదరాబాద్: అసలు స్కూల్ పేరుతో నకిలీ స్కూల్ వెలసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. నగరంలో పేరుగాంచిన ప్రముఖ 'సెయింట్ ఆన్స్' (st Ann's) స్కూల్ పేరుతో ఈసీఐఎల్ చౌరస్తా కు కూత వేటు దూరంలో కుషాయిగూడ పారిశ్రామికవాడలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు భవనం వెనకాల ఓ స్కూల్ వెలిసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చేందుకు క్యూ కడుతున్నారు. అక్కడ సిబ్బంది నగరంలోని తార్నాక, బొల్లారం, సికింద్రాబాద్, కూకట్ పల్లి తదితర ప్రాంతాలలో తమ బ్రాంచీలు ఉన్నాయని చెబుతున్నారు.
దీంతో అనుమానం వచ్చిన విద్యార్థి సంఘాలు ఆ స్కూల్ గురించి ఆరా తీశారు. సదరు స్కూలు పేరు 'సెయింట్ అని స్కూల్' (st anne's school) పేరుతో పర్మిషన్ కోసము డీఈవో కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నారని తెలిసింది. నకిలీ పేరు పెట్టుకుని అడ్మిషన్లు దండుకోవాలనే దురుద్దేశం ఒకటైతే, కుషాయిగూడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో అది విష వాయువులు చిమ్మే 'వెట్ ఇండియా ఫార్మా' కంపెనీ కి అనుకొని ఉండటం ఒక్కింత ఆందోళన కలిగించే ఇంకో విషయం.
ఇండస్ట్రియల్ జోన్ లో స్కూల్‌ను ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ ప్రాంతంలో ఏర్పాటు చేశామని విద్య అధికారులను పక్కదోవ పట్టించడం మరో విషయం. ఇంత జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా లేక వారి కను సైగల్లోనే నడుస్తుందా అన్న అనుమానాలు రేకత్తిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.