నకిలీ మెడికల్ బిల్లుల కుంభకోణం: హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్‌

నకిలీ మెడికల్ బిల్లుల కుంభకోణంలో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని వివిధ ఆసుపత్రులపై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2024 6:05 PM IST
నకిలీ మెడికల్ బిల్లుల కుంభకోణం: హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్‌

నకిలీ మెడికల్ బిల్లుల కుంభకోణంలో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని వివిధ ఆసుపత్రులపై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. కుంభకోణం వెలుగులోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆసుపత్రుల ఉద్యోగులు, స్థానికులు, పరిపాలన అధికారులు అవసరమైన వారికి అందాల్సిన ప్రభుత్వ నిధులు దక్కకుండా చేస్తూ సొంత అకౌంట్లలోకి వేసుకుంటూ ఉన్నారు.

తెలంగాణ సచివాలయంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ (సిఎంఆర్‌ఎఫ్) సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్‌ఎసి) డిఎస్‌ఎన్ మూర్తి ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. స్కామ్‌లో భాగమైన వ్యక్తులు నకిలీ మెడికల్ ఇన్‌వాయిస్‌లను తయారు చేశారని.. ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) కార్యక్రమం ద్వారా రీయింబర్స్‌మెంట్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారని ఆరోపించారు.

నకిలీ బిల్లుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థికంగా నష్టపోయింది. హైదరాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆసుపత్రుల్లో అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ సదన్ - ఎక్స్ రోడ్, శ్రీకృష్ణ హాస్పిటల్- సైదాబాద్, జననీ హాస్పిటల్- సైదాబాద్, హిరణ్య హాస్పిటల్- మీర్‌పేట్, డెల్టా హాస్పిటల్- హస్తినాపురం, శ్రీ రక్షా హాస్పిటల్- బిఎన్ రెడ్డి నగర్, MMS హాస్పిటల్- సాగర్ రింగ్ రోడ్, ADRM మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్- శారదానగర్, MMV ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్- కొత్తపేట, శ్రీ సాయి తిరుమల హాస్పిటల్- బైరామల్‌గూడ ఉన్నాయి.



ఖమ్మంలో శ్రీశ్రీకర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్ లపై ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి. నల్గొండలో మిర్యాలగూడలోని నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడలోని మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్‌లోని అమ్మ హాస్పిటల్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

కరీంనగర్ సప్తగిరి హాస్పిటల్, శ్రీ సాయి హాస్పిటల్- పెద్దపల్లి, రోహిణి మెడికేర్ ప్రై. లిమిటెడ్- హనుమకొండ (వరంగల్), శ్రీ సంజీవిని హాస్పిటల్, మహబూబాబాద్‌లోని సిద్ధార్థ హాస్పిటల్ కూడా నకిలీ బిల్లుల మోసానికి పాల్పడినట్లు తేలడంతో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. CID ప్రాథమిక విచారణ ప్రకారం.. కల్పిత బిల్లులను సిద్ధం చేసి.. ప్రజల పేర్లను వాడుకున్నారు. ఈ కార్యకలాపాలు పలు జిల్లాల్లో వ్యాప్తి చెందడం వల్ల ఇది చాలా భారీ స్కాం అని భావిస్తూ ఉన్నారు. వైద్యం చేయకున్నా బిల్లులు కాజేశారని.. నకిలీ పేర్ల మీద వందల కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని విచారణలో తేలింది. సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Next Story