రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ - కేవైసీ గడువును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది.

By అంజి  Published on  28 Jan 2024 1:04 AM GMT
e KYC, ration cards, Department of Civil Supplies, Telangana

రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ - కేవైసీ గడువును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ - కేవైసీ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుండగా రేషన్‌ షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తుండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75 శాతం మంది ఈ - కేవైసీ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఫిబ్రవరి నెల ఆఖరు కల్లా 100 శాతం ఈ కేవైసీని పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ని ఆదేశించారు.

బోగస్‌ కార్డుల ఏరివేతకు చేపట్టిన ఈ-కేవైసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు, పెండ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపిల్లల పేర్లు అలాగే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల నుంచి వేలిముద్రలను మళ్లీ సేకరిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు అక్కడి రేషన్‌ షాపుల్లో కేవైసీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు.

Next Story