Rangareddy district: పెయింట్ పరిశ్రమలో భారీ పేలుడు.. 14 మంది తీవ్రగాయాలు
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం బూర్గుల శివారులోని పెయింట్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.
By అంజి Published on 17 July 2023 8:57 AM ISTRangareddy district: పెయింట్ పరిశ్రమలో భారీ పేలుడు.. 14 మంది తీవ్రగాయాలు
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం బూర్గుల శివారులోని పెయింట్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 11 మంది శరీరాలు 50 శాతానికిపైగా కాలిపోయాయి. వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం కంపెనీ యాజమాన్యం హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించింది. బూర్గుల వివారులోని శ్రీనాథ్ రోటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో డైపర్స్, పెయింట్స్‌తో పాలు పలు తయారీ విభాగాలు ఉన్నాయి. పెయింట్ విభాగంలో పని చేస్తున్న కార్మికులు.. నిన్న రాత్రి విధులకు వెళ్లారు. ఈ క్రమంలోనే రంగుల తయారీ యంత్రం ఒక్కసారిగా పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగి.. 14 మందికి నిప్పంటుకుంది. మంటల ధాటికి వారి శరీరాలు కాలిపోయాయి. బాధితులందరూ 30 ఏళ్ల వయస్సు లోపు వారే.
ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో 50 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు సమాచారం. గాయపడినవారిని తోటి కార్మికులు చికిత్స కోసం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత 50 శాతం కంటే ఎక్కువగా కాలిపోయిన 11 మందిని హైదరాబాద్‌కు తరచినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి బాధితులను డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్వల్ప గాయాలైన ముగ్గురిని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు రంగుల తయారీ యంత్రంలో చెలరేగిన మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రులు మంజు దాస్, ప్రదేపన్, శరత్, గిరధర్ సింగ్, రాహుల్ సునీల్, జేజే పాత్రు, పురాన్ సింగ్, మిర్లాల్ మందారి, రాజులు అని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారంతా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడకు బతుకుదెరువు కోసం వచ్చినవారే.