హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్టు జరుగుతున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఈ విషయమై తమను పౌరసరఫరాల శాఖ కానీ, మీసేవ కానీ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు.
అటు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణపై పౌరసరఫరాల శాఖ స్పష్టతనిచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం లేదని తెలిపింది. మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్ చేయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే మీసేవను కోరినట్లు స్పష్టం చేసింది. అయితే, రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు మీసేవ ద్వారా స్వీకరించబడుతున్నాయని తెలిపింది.