ఎల్‌ఆర్‌ఎస్‌కి అప్లై చేశారా?.. దగ్గరపడుతోన్న రాయితీ గడువు
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
By అంజి
ఎల్‌ఆర్‌ఎస్‌కి అప్లై చేశారా?.. రాయితీ గడువు ముగుస్తోంది
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన జీవో 28 ప్రకారం.. మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది. గడువు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
26 ఆగస్టు 2020కు ముందు అక్రమ లే అవుట్లను ఈ స్కీం కింద క్రమబద్ధీకరిస్తారు. లే అవుట్‌లోని ప్లాట్లలో కనీసం 10 శాతం ఇప్పటికే విక్రయించి ఉండాలి. ఇప్పటికే రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు.. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫీజు చెల్లించి ప్రక్రియ పూర్తి చేయాలి.
రిజిస్ట్రేషన్ చేసే ముందు.. సంబంధిత లే అవుట్ లేదా అందులో ప్లాట్లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌తో పాటు నిషేధిత జాబితా, ఇతర ఎలాంటి వివాదాల్లో లేవని నీటిపారుదల శాఖ, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు నిరంభ్యంతర పత్రం ఇవ్వాలి. వీటినే లెవల్ -1 అనుమతుల కింద భావిస్తారు.
రాయితీ ఎలా ఇస్తారంటే?
ఎల్‌ఆర్‌ఎస్ కింద 31.3.2025 లోపు.. అంతకుముందు ఫీజు చెల్లించిన వారికి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఇస్తారు. ఇప్పటికే కొంత ఫీజు చెల్లించిన వారు సైతం పెండింగ్ మొత్తంలో రాయితీ మినహాయించుకొని మిగతా సొమ్ము చెల్లించే అవకాశం కల్పించారు. 2020 ఆగస్టు 26కు ముందు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అభివృద్ధి చేసి అందులో 10శాతం ప్లాట్లు విక్రయించిన వాటినే అక్రమ లే అవుట్‌గా పరిగణిస్తున్నారు. వాటిల్లో డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, కంకర, బీటీ రోడ్లు లాంటి మౌలిక వసతులు తప్పనిసరి. ఇలాంటి లే అవుట్‌లో ప్లాట్లకు మాత్రమే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్‌లో జరిగిన తప్పులతో క్రమబద్ధీకరణకు నోచుకోని ప్లాట్ల విషయంలో ఇప్పటికే అధికారులు ఆ తప్పులను సరి చేశారు. ఇంకా ఎక్కడైనా ఉంటే.. ఆ వివరాలతో అధికారులను సంప్రదిస్తే వాటిపై చర్యలు చేపడతారు.