తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ట్వీట్‌ దుమారం

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పెట్టిన ట్వీట్‌ అయితే రాష్ట్ర బీజేపీలో కలకలం సృష్టిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2023 12:03 PM IST
EX MP, Jithender Reddy, Tweet, BJP, Viral, Telangana

తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ట్వీట్‌ దుమారం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కానీ.. రాష్ట్ర బీజేపీలో మాత్రం రోజుకో కల్లోలం బయటపడుతోంది. ఇటీవల ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పార్టీలో యాక్టివ్‌గా లేరని.. అయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన స్పందించి తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులంటూ వార్తలు వచ్చాయి. దీంతో.. తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం ఎలా ఉందో అర్థమవుతోంది. ఇక మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పెట్టిన ట్వీట్‌ అయితే రాష్ట్ర బీజేపీలో కలకలం సృష్టిస్తోంది.

ఓ వ్యక్తి దున్నపోతుని ట్రాలీలోకి ఎక్కించేందుకు వెనకాల నుంచి కాలితో తన్నుతాడు. ఇలాంటి ట్రీట్‌మెంటే పార్టీ నాయకత్వానికి కావాలంటూ క్యాప్షన్ ఇచ్చి జితేందర్‌రెడ్డి వీడియోను ట్వీట్‌ చేశారు. కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. తిరిగి మళ్లీ ఆ వీడియోను అలానే ఉంచి.. మరో ట్వీట్‌ చేశారు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి. మొదటి ట్వీట్‌ బండి సంజయ్‌ సహా నాయకత్వం మొత్తాన్నే ఉద్దేశించినట్లు ఉంటే.. రెండో ట్వీట్‌ మాత్రం బండి సంజయ్‌కి సపోర్ట్‌గా ఉంది.

రెండో ట్వీట్‌లో బండి సంజయ్‌ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వారికి ఇలాంటి చికిత్స అందుతుందని తెలుసుకోవాలని రాసుకొచ్చారు జితేందర్‌రెడ్డి. కేసీఆర్ సోషల్‌ మీడియా కుక్కలకు వ్యతిరేకంగా తన ట్వీట్ చేశానని జితేందర్‌రెడ్డి వివరించే ప్రయత్నం చేశారు. బిస్కెట్ల కోసం విధ్వంసం చేస్తున్నారని జితేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. కానీ.. మొదటి ట్వీట్‌తో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన పార్టీపైనే జితేందర్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జితేందర్‌రెడ్డి ట్వీట్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. బీజేపీ అంతర్గత తన్నులాటలను అద్బుతమైన పోలికతో ప్రజలకు జితేందర్‌రెడ్డి వవరించారని అన్నారు. బీజేపీలో పరిస్థితి ఎలా ఉందో జితేందర్‌రెడ్డి ట్వీట్‌తో అర్థమవుతోందని.. ఇంతకంటే గొప్పగా ఇంకెవరూ చెప్పలేరని అన్నారు రేవంతర్‌రెడ్డి. ట్వీట్‌ డెలీట్‌ చేసి మరీ పోస్ట్‌ చేయడంతో జితేందర్‌రెడ్డి పోస్ట్‌ దుమారం రేపుతోంది. ఈ రచ్చ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Next Story