కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ జల దోపిడీ మొదలైంది: హరీష్ రావు
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా..అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోందని..మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
By Knakam Karthik
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ జల దోపిడీ మొదలైంది: హరీష్ రావు
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా..అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోందని..మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ , జీఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. సంబంధిత నదిపరివాహక రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదిపరివాహక ప్రాంతానికి ఆనుకుని అన్ని రాష్ట్రాలు అందుకు ఒప్పుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఈ నియమ, నిబంధనలేవీ పాటించకుండానే గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కేంద్రం జుట్టు తమచేతిలో ఉందని రాత్రికి రాత్రే ప్రాజెక్ట్ రూపకల్పన చేసి, టెండర్లు పిలిచి కేంద్రం ముందు పెట్టారని ఆరోపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టిన ప్రాజెక్టులకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడ్డుపడ్డాయని, ఇప్పుడు కొత్త ప్రాజెక్టును నియమ, నిబంధనలను ఉల్లంఘించి ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని వాపోయిన సీఎం.. ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని వారికి పదవుల్లో కొనసాగే అర్హత ఉందా ? అని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రానికి నీటి నష్టం జరగబోతుంటే సీఎం, జలవనరులశాఖ మంత్రి నోరు మెదపరేంటని హరీష్ రావు ప్రశ్నించారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టేశాం కాబట్టి నీళ్లు తీసుకుంటామని పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర అన్నారు. ఏపీలో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో కాళేశ్వరం మరో ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టులకు రూ.60 వేల కోట్ల వరకూ సహాయం చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో ప్రాజెక్టులకు ఒక్కపైసా అయినా ఇచ్చారా? అని నిలదీశారు.