అలా వారిని తప్పించడం సీఎం అనాలోచిత నిర్ణయం : హరీష్ రావు

తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్యలపై రేవంత్ రెడ్డి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట‌ర్ ద్వారా కోరారు.

By Kalasani Durgapraveen  Published on  29 Oct 2024 5:57 AM GMT
అలా వారిని తప్పించడం సీఎం అనాలోచిత నిర్ణయం : హరీష్ రావు

తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్యలపై రేవంత్ రెడ్డి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట‌ర్ ద్వారా కోరారు. తన వ్యక్తిగత భద్రత నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించడం సీఎం అనాలోచిత నిర్ణయం అన్నారు. తన చర్యతో సీఎం పదిహేడు వేల మంది స్పెషల్ పోలీసులను అవమానపరిచారన్నారు. రేవంత్ రెడ్డి చర్య తండ్రి కొడుకులను విశ్వాసంలోకి తీసుకోనట్లుగా ఉందన్నారు.

స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ లాంటి వారు.. వారి ఆత్మస్థైర్యాన్ని సీఎం దెబ్బతీయకూడదన్నారు. స్పెషల్ పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏక్ పోలీస్ విధానాన్ని తీసుకురాబోతున్నామ‌ని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం? అని ప్ర‌శ్నించారు. సస్పెండ్, డిస్మిస్ అయిన స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లోకి చేర్చేందుకు సీఎం జోక్యం చేసుకోవాలన్నారు.

స్పెషల్ పోలీసులపై సచివాలయ ముఖ్య భద్రతా అధికారి ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలు పెడుతూ విడుదల చేసిన సర్క్యూలర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లు చేసినా, ఆ పోలీసులు పట్ల చర్యలు ఉంటాయని పేర్కొనడం దుర్మార్గం అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదన్నారు.


Next Story