సింగరేణి కార్మికులకు మంచి ఆఫర్ ప్రకటించిన ఈటల రాజేందర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 7:54 PM ISTసింగరేణి కార్మికులకు మంచి ఆఫర్ ప్రకటించిన ఈటల రాజేందర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేలా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజల్లో తిరుగుతూ హామీలు ఇస్తూ ఉన్నాయి. బీజేపీ కూడా ఇలాగే ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సింగరేణి కార్మికులకు మంచి ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేస్తామని చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాదు.. అధికారపార్టీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయన్నారు. మూడోస్థానంలో నిలుస్తుందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ మద్యం, డబ్బు, పోలీసులను నమ్ముకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముతున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే.. సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేస్తామని ఈటల హామీ ఇచ్చారు. కేసీఆర్ సర్కార్ సింగరేణి కార్మికుల సంఖ్య 39వేలకు తగ్గించిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనులు ఏర్పాటు చేస్తాని చెప్పి.. సింగరేణిని ప్రయివేట్ చేతిలో పెట్టిన వ్యక్తి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని వాగ్దానం ఇచ్చారు ఈటల రాజేందర్. కష్టపడి, ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించినదంతా ఆదాయ పన్ను కట్టడానికే పోతుందని అన్నారు ఈటల. ఆదాయపు పన్ను విషయంలో మినహాయింపు ఇవ్వాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారని.. తాము అధికారంలోకి వస్తే చేస్తామని ఈటల హామీ ఇచ్చారు.