హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం

Etela Rajender takes Oath as Huzurabad MLA.హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) అభ్య‌ర్థిగా విజ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Nov 2021 7:46 AM GMT
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన ఈటల రాజేంద‌ర్ బుధ‌వారం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీక‌ర్ చాంబ‌ర్‌లో ఆయ‌న‌తో స‌భాప‌తి పోచారం శ్రీనివాస రెడ్డి ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డిల‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఈటల గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి రాజాసింగ్, రఘునందన్ రావు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పుడు ఈటల రాజేంద‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ ఏర్పడిందంటున్నారు బీజేపీ నేతలు.

ఇక ఈటల ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం కొండా విశ్వేశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. ఈట‌ల తెలంగాణ ఉద్య‌మకారుడ‌న్నారు. ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల గెల‌వ‌డంతో ఉద్య‌మకారులంతా పార్టీల‌క‌తీతంగా సంబుర ప‌డుతున్నార‌న్నారు. ఉద్య‌మ‌కారుడికి మ‌ద్దుగానే తాను ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన‌ట్లు కొండా విశ్వ‌శ్వ‌ర్ చెప్పారు.

భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయడాన్ని అవమానంగా భావించిన ఈటల రాజేందర్.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నిక‌లో 24వేలపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈట‌ల‌.

Next Story