ప్రారంభమైన ఈటల రాజేందర్ పాదయాత్ర
Etela Rajender padayatra starts.మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్ర ప్రారంభమైంది.
By తోట వంశీ కుమార్ Published on 19 July 2021 11:24 AM ISTమాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్ర ప్రారంభమైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినవారిపల్లె నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరారు. అంతకముందు ఈటల సతీమణి జమున, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేపట్టబోతున్న తొలి కీలకమైన రాజకీయ కార్యాచరణ ఇదే కావడం గమనార్హం. ఈ పాదయాత్రకు సంబంధించి బీజేపీ శ్రేణులు, ఈటల అనుచరులు భారీ ఏర్పాట్లను చేశారు. పాదయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చారు. ఈరోజు (తొలిరోజు) శనిగరం, మాదన్నవీధి, గురిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా 23 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది.
మరోవైపు పాదయాత్ర గురించి నిన్న ఈటల మాట్లాడుతూ.. బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. అందరి అండదండలు, ప్రేమాభిమానాలు తనకు కావాలని కోరారు. ఆత్మగౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు అని చెప్పారు. ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నానన్నారు.
హుజూరాబాద్‌లో ఈటలకు బదులు ఆయన సతీమణి జమున పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని .. ఈ ఉప ఎన్నికలో తాను కూడా బరిలో నిలిచే అవకాశం ఉందనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బరిలో ఉన్నా.. తాను పోటీ చేసినా ఒక్కటేనని జమున అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు ఈటలకు దూరంగా ఉండి.. భార్యను బరిలోకి దింపుతారా? అని హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.