మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని అన్నారు. నయీం గ్యాంగ్ తనను చంపేందుకు రెక్కీ నిర్వహించిందన్న ఈటల రాజేందర్.. అప్పుడే భయపడలేదని, ఇప్పుడు భయపడుతానా? అని ప్రశ్నించారు. 'ఈటల నా తమ్ముడు అని చెప్పుకున్నారు కదా?.. ఇప్పుడు ఆ తమ్ముడు దెయ్యం అయ్యాడా?' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈటల సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ నా మీద తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని అనుకుంటూ ఉన్నానని చెప్పుకొచ్చారు. భూకబ్జా పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. ఉద్దేశ పూర్వకంగానే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని అన్నారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. జమున హ్యాచరీస్‌లో తాను డైరెక్టర్‌ను కాదని, అది తన కొడుకు, కోడలికి చెందినదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశానని ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదనిఅన్నారు. అధికారులు కనీసం వావీ వరసలు లేకుండా రాసుకొని వచ్చారని అన్నారు.

నాకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారని ఆరోపించిన ఈటల రాజేందర్.. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదన్నారు. నోటీస్ ఇవ్వకుండా సర్వే చేసినందుకు కోర్టుకు వెళ్తానని ఈటల స్పష్టం చేశారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కానని అన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థ శాశ్వతం అని అన్నారు. భూముల వ్యవహారంలో సంబంధిత గ్రామ సర్పంచ్ ఉదయం ఒక మాట చెప్పారు.. సాయంత్రానికి ఒక మాట మార్చారని అన్నారు. వ్యక్తులు ఉంటారు పోతారు.. ప్రజలు మాత్రం శాశ్వతం అని అన్నారు. ధర్మం అన్నది ఎప్పటికైనా ఉంటుందని అన్నారు. మానవ సంబంధాలు శాశ్వతమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ హితవు చెప్పారు.

ఇక కొత్త పార్టీ పెట్టడంపై ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదని.. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని.. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.


సామ్రాట్

Next Story