గుండెల్లోని బాధ‌ను ఓట్ల రూపంలో : ఈట‌ల‌

Etela rajender casts his vote in Huzurabad Bypoll.హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2021 4:56 AM GMT
గుండెల్లోని బాధ‌ను ఓట్ల రూపంలో : ఈట‌ల‌

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మైంది. 9 గంటల సమయానికి 10.5 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన భార్య జమునతో కలిసి కమలాపూర్ లోని 262 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధ్యం ఏరులై పారింద‌ని.. వంద‌ల కోట్ల రూపాయ‌లు పంపిణీ చేశార‌ని ఆరోపించారు. పోలీసులే స్వ‌యంగా ర‌క్ష‌ణ క‌ల్పించి అధికార పార్టీ డ‌బ్బులు పంచేలా చేశార‌నన్నారు. ప్ర‌జ‌లే బ‌హిరంగంగా త‌మ‌కు డ‌బ్బు అంద‌లేద‌ని చెప్ప‌డం ప్ర‌జాస్వామ్యానికి మాయ‌ని మ‌చ్చ‌గా అభివ‌ర్ణించారు.

ఓ ఎన్నిక కోసం ఇన్ని వందల కోట్లను ఖర్చు చేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈటల రాజేంద‌ర్‌ను అసెంబ్లీలో చూడొద్ద‌ని సీఎం కేసీఆర్ పంతం ప‌ట్టుకున్న‌ట్లు ఉన్నార‌ని.. అందుకే గెలిచేందుకు అధికార యంత్రాంగం సాయంతో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నార‌ని ఆరోపించారు. అయితే.. ధర్మమే విజయం సాధిస్తుందని చెప్పారు. హుజూరాబాద్‌లో ఏం జరుగుతోందనే విషయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తుంద‌న్నారు. ప్రజలు ఓట్ల రూపంలో త‌మ గుండెల్లోని బాధ‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నార‌న్నారు. పోలింగ్ ప్రారంభం కాగానే పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లివ‌చ్చార‌ని.. 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అవుతుంద‌ని ఈట‌ల అంచ‌నా వేశారు. హుజూరాబాద్‌లో ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌ని ఈటల భార్య జమున అన్నారు.

Next Story