ఉపాధి, ఆదాయం వచ్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి: భట్టి

రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

By Knakam Karthik
Published on : 26 May 2025 7:30 AM IST

Telangana, Deputy Cm Bhatti Vikramarka, Industrial Promotion Sub Committe Meeting

ఉపాధి, ఆదాయం వచ్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి: భట్టి

రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్, ఇప్పటికే చేసుకున్న ఎంవోయుల అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఒక పరిశ్రమ స్థాపిస్తే అందుకు అనుబంధంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్న ప్రతిపాదనలపై దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇకనుంచి ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహిద్దామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. ఒక పరిశ్రమ ఏర్పాటుతో అనేక అనుబంధ పరిశ్రమలు రావడం తద్వారా రాష్ట్ర యువతకు వేళల్లో ఉద్యోగాలు, రాష్ట్ర ఖజానాకు పెద్ద సంఖ్యలో ఆదాయం సమకూరే వ్యూహాత్మక ప్రాధాన్యతను అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని అధికారులకు సబ్ కమిటీ సూచించింది.

జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హుండాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. 675 ఎకరాల్లో 8528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రాష్ట్రానికి రావడం గొప్ప విజయం గా సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఈ రీసర్చ్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 4276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సమావేశంలో వివరించారు. రీసెర్చ్ సెంటర్ లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటో టైపింగ్ ప్రధాన వ్యవస్థలు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు సబ్ కమిటీకి వివరించారు. ప్రస్తుతం ప్రారంభించబోతున్న పరిశ్రమలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి, ఆదాయాన్ని రాష్ట్రానికి సమకూరుస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Next Story