వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం.. 'మన ఊరు – మన బడి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 'మన ఊరు – మన బడి' పైలాన్‌ను మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరంప్రసంగించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని తెలిపారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కోరారు. తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని పైకి వచ్చిన వాళ్లమే అని తెలిపారు. ఈ రోజు మీ ముందు ఈ హోదాలో నిలబడ్డామంటే.. ఆరోజు గురువులు చెప్పిన విద్యనే కారణమని చెప్పారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
అనంతరం వనపర్తిలో అన్నిహంగులతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించారు.